అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని అమలగూడ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు తాగునీరు, రహదారి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామంలో సుమారు 10 కుటుంబాలు నివసిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా మంచినీటి కోసం గ్రామస్తులు లోతైన కొండలు దిగుతూ, ఎక్కుతూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవికాలం కావడంతో సహజ జల వనరులు కూడా ఎండిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మంచినీటి కొళాయి ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్ కూడా గ్రామానికి చేరడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుగా రోడ్డు మార్గాన్ని సిద్దం చేసుకోవాల్సి రావడంతో గ్రామస్తులే శ్రమదానంతో తుప్పలు నలుగుతూ మార్గం సిద్దం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మే 27, 2026న గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి గ్రామానికి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ శ్రమదాన కార్యక్రమంలో కొర్ర గోపి, కొర్ర కౌసల్య, కుర్ర రాధతో పాటు గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








