కరీంనగర్, గురువారం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో కాలువ మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ మాధరి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు.
మాదాపూర్ గ్రామ పరిధిలోని డి-9 ఎల్-1 కెనాల్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడిక మట్టిని తొలగించి సాగునీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామ రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉపాధి హామీ కూలీలు పనులను కొలతల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించి అధిక వేతనం పొందాలని సూచించారు. అలాగే, పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ మేటుకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్లెం అనితతో పాటు అధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.








