కరీంనగర్ జిల్లా: ఈ నెల 3వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన సంచలన రాబరీ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి అయిన సుభోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు.
ఈ కేసుతో పాటు ఇతర పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న సుభోధ్ సింగ్‌పై వివిధ కోర్టుల్లో నమోదైన కేసుల నేపథ్యంలో, మొత్తం ఆరు కోర్టుల పరిధిలో పీటీ వారెంట్లకు అనుమతులు పొందిన అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.
సుభోధ్ సింగ్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్‌కు చేరుకోగా, అర్ధరాత్రి నిందితుడిని గౌరవ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
కేసుకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు, నిందితుడిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.








