సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మంగళవారం సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను పరామర్శిస్తూ అధైర్యపడొద్దని, తమ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని హరీశ్ రావు ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసగిస్తున్నాయని ఆరోపించారు. వడ్లు, మక్కలు, సన్‌ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనుగోలు చేయాలని అడిగితే కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై నెపం నెడుతున్నారని, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఇక్కడ ధర్నాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులు, వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం జలాలతో రైతులకు బంగారం లాంటి పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చారని, ఇప్పుడు కొనుగోలు వ్యవస్థ సరిగా లేక రైతులు తమ పంట అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ ట్యాగింగ్, కొత్త నిబంధనల పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కూర్చుని 80 శాతం వడ్లు కొనుగోలు చేశామని చెబుతున్నారని, కానీ గ్రామాల్లో ఇప్పటికీ పెద్దఎత్తున ధాన్యం కల్లాల్లోనే ఉందని చెప్పారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ప్రతి గింజను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే ధాన్యం దించుకుంటామని రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
ఏ-గ్రేడ్ ధాన్యాన్ని కూడా బీ-గ్రేడ్‌గా నమోదు చేస్తూ రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నారని అన్నారు. తరుగు, రవాణా, హమాలీ, వెయిటింగ్ ఛార్జీల పేరుతో రైతులపై వేలాది రూపాయల భారం మోపుతున్నారని విమర్శించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలుత 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం అవుతామని చెప్పడం సిగ్గుచేటని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు.
సన్‌ఫ్లవర్, జొన్నలు, శనగలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులు నష్టపోకుండా కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రెండు నెలలుగా సన్‌ఫ్లవర్ కొనుగోలు లేక చెదలు పడుతున్నాయని, ప్రభుత్వం కనీసం గన్నీ బ్యాగులు కూడా అందించలేకపోతోందని విమర్శించారు.
వానాకాలం సమీపిస్తున్నా విత్తనాలు, ఎరువుల నిల్వలు సిద్ధం చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులపై వేల కోట్ల భారం మోపాయని ఆరోపించారు.
బక్రీద్ పండుగ కారణంగా లారీ డ్రైవర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి వారం రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి ఆ లారీలను ధాన్యం రవాణాకు వినియోగించాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు ముఖ్యమా? ఇసుక ఆదాయం ముఖ్యమా? ప్రభుత్వం తేల్చుకోవాలని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో రాధాకృష్ణశర్మ, కూర మాణిక్యరెడ్డి, కాముని శ్రీనివాస్, పిన్నింటి అభిరెడ్డి, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కీసరి పాపయ్య, ములకల కనకరాజు, వెంకట్‌రెడ్డి, శ్రీహరి యాదవ్, యాట యాదయ్య, గుండెల్లి వేణు, ధర్మాజీపేట తిరుపతిరెడ్డి, కర్నే కన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మన్నే ఆనంద్, మధుసూదన్ రెడ్డి, ఎదుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








