చౌడేపల్లి, చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.
శ్రీనివాస కళ్యాణ మండపాన్ని పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మహానాడు అనేది కేవలం పార్టీ పండుగ మాత్రమే కాదని, ప్రజా సమస్యలపై చర్చించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే ముఖ్య వేదిక అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా గ్రామ స్థాయిలో కార్యకర్తలు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, యువత, వృద్ధులు, విద్యార్థుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ ముదిరాజు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక లాంటివారు. మహానాడు ఇచ్చిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
మరో నేత లక్ష్మీపతి రాజు మాట్లాడుతూ, “రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర చిరస్మరణీయం. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ పేదల అభ్యున్నతి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ ముదిరాజు, లక్ష్మీపతి రాజు, ఆవుల రామచంద్రయ్య, బోయకొండ శివప్ప నాయుడు, అప్పనపల్లి రామకృష్ణ, కార్తీక్ తదితర నాయకులతో పాటు మండలంలోని పలు గ్రామ పంచాయతీల నుంచి భారీ సంఖ్యలో మహిళలు, యువ కార్యకర్తలు పాల్గొన్నారు.








